తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం విరుచుకుపడ్డారు. ఈరోజు రాజన్న-సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. మిషన్ భగీరథకు రూ.14 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసినా తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు. మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి 'హర్ ఘర్ జల్' పథకాన్ని ప్రవేశపెట్టినందుకు సిగ్గుపడాలి'' అని మంత్రి అన్నారు.
ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.16 లక్షలు జమ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, దేశంలో ఎవరికైనా డబ్బు వచ్చిందా అని ప్రశ్నించారు. 'వన్ నేషన్.. వన్ ఎలక్షన్, వన్ నేషన్.. వన్ రేషన్, వన్ నేషన్.. వన్ రిజిస్ట్రేషన్' అని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని.. 2014 ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించడం పొరపాటు జరిగిందన్నారు. గత మూడేళ్లలో వేములవాడ ఆలయ అభివృద్ధికి ఏమైనా ఖర్చు చేశారా అని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌ను మంత్రి ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లుగా సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంతవరకు కేంద్రం నుంచి నిధులు రాలేదని రామారావు తెలిపారు.