సంచలనం.. కేటీఆర్‌పై కేసు నమోదు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది.
By Medi Samrat Published on 19 Dec 2024 5:00 PM ISTమాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేటీఆర్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. మరో రెండు కేసులు 409, 120B సెక్షన్లను చేర్చారు. నాలుగు సెక్షన్లు నాన్‌బెయిలబుల్ కేసులు కావడం విశేషం. కేసులో A-1గా కేటీఆర్, A-2గా అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A-3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి పేర్లను చేర్చారు.
మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్‌పై అధికార దుర్వినియోగం, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. RBI మార్గదర్శకాలకు విరుద్దంగా FEO సంస్థకు నిధులు బదలాయింపు చేసినట్లు ఆరోపించింది. భారతీయ కరెన్సీలో విదేశీ సంస్థకు రూ.46 కోట్ల మేర నిధులు చెల్లించినట్లు ప్రస్తావించింది. RBI అనుమతి లేకుండా చెల్లించడంపై రూ.8 కోట్ల పెనాల్టీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత RBI పెనాల్టీ చెల్లింపు జరిపింది. RBI పెనాల్టీతో ఈ రేస్ స్కామ్ తో బట్టబయలు అయ్యింది. HMDA బోర్డు నుంచి రాష్ట్ర కేబినెట్ అనుమతి లేకుండా కేటీఆర్ సొంత నిర్ణయం, ఆదేశాలతో డబ్బులు చెల్లించారు అధికారులు. ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండానే నిధుల విడుదల అయినట్లు గుర్తించారు.