అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు నాకున్న ప్రతి హక్కును వినియోగించుకుంటా
ఫార్ములా-ఈ కేసు అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ మాట్లాడుతూ..
By Medi Samrat Published on 7 Jan 2025 10:01 PM ISTపచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది.. అట్లాగే అవినీతిపరులకు అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి.. 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకు.. పొలిటికల్ లోఫర్లకు.. ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో ఎంతో కొంత చేతులు మారినట్టు అనిపిస్తుందని కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఫార్ములా-ఈ కేసు అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ మాట్లాడుతూ.. ఏదో జరిగిపోయింది అన్నట్టు పొద్దుటి నుంచి కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తున్నారు.. నా మీద పెట్టింది అక్రమ కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు, ఏమీ లేని లొట్టపీసు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు వెళ్లానన్నారు. భారత పౌరుడిగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి పెడుతున్న అక్రమ కేసులను రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు నాకున్న ప్రతి హక్కును వినియోగించుకుంటానన్నారు. ఏసీబీ విచారణకు ఆఫీసుకు లాయర్‌తో సహా హాజరవుతానని చెప్పాను. అరగంట వేచి చూసినా ఏసీబీ అధికారులు నన్ను ప్రశ్నలు అడగడానికి వెనుక ముందైన్రు అని అన్నారు.
ఇవాళ హైకోర్టులో కేవలం క్వాష్ పిటీషన్ మాత్రమే కొట్టేశారు. దానికే కాంగ్రెస్ నాయకులు చాలా సంతోషపడుతున్నారు. నాకేదో ఉరిశిక్ష వేసినట్టు నేరారోపణ జరిగినట్టు సంకలు గుద్దుకుంటున్నారు. క్వాష్ పిటీషన్ కొట్టి వేయడంపై సుప్రీంకోర్టుకు పోతాం.. కొద్ది రోజుల్లో విచారణకు వస్తుంది.. అక్కడ కూడా న్యాయపోరాటం చేస్తానన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను విచారణకు హాజరయ్యాను.. కానీ లాయర్లతో రావద్దన్నారు.. పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్‌ను ఇచ్చినట్టు మీడియాకి లీకులు వదిలి సతాయించారు. అందుకే లాయర్ల సమక్షంలోనే నా విచారణ జరగాలని రేపు హైకోర్టుకు వెళుతున్నాను.. ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించాలని కోర్టుకు వెళుతున్నాను.. కొందరు మంత్రులు న్యాయమూర్తులై వాళ్ళే శిక్షలు వేస్తున్నారు.. ట్రయల్ మీడియాలో, సెక్రటేరియట్లో, మంత్రుల పేషీలో జరగదు.. ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుందన్నారు.