బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

By -  Knakam Karthik
Published on : 15 Sept 2025 5:50 PM IST

Telangana, Brs, Ktr, Bandi Sanjay, Bjp, Defamation Suit

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తప్పుడు మరియు నిరాధారమైన ఆరోపణలను ప్రచురించినందుకు, ప్రసారం చేసినందుకు ఆయన ఈ దావా వేశారు. ఈ దావాలో, పరువు నష్టం కలిగించినందుకు గాను తప్పుడు సమాచారాన్ని తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని, రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తన న్యాయవాది ఎం/ఎస్ పి.వి. జాననీ & అసోసియేట్స్ ద్వారా ఈ కేసు నమోదు చేశారు.

కేటీఆర్ ఫిర్యాదులోని ముఖ్యాంశాలు:

2025 ఆగస్టు 8న బండి సంజయ్ తప్పుడు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలలో తెలంగాణ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్ మరియు ఆర్థిక అవకతవకలకు కేటీఆర్‌ను ముడిపెట్టారు. కాగా పలు తెలుగు మీడియా ఛానెళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, మరియు ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్‌బుక్/ఇన్‌స్టాగ్రామ్) వంటి సోషల్ మీడియా సంస్థలు ఈ వ్యాఖ్యలను విస్తృతంగా ప్రసారం చేశాయి. ఈ వ్యాఖ్యలు కేవలం పరువుకు భంగం కలిగించడమే కాకుండా, కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయి. 2025 ఆగస్టు 11న లీగల్ నోటీసు పంపినప్పటికీ, బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. దీంతో కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతో "విపరీతమైన నిందారోపణలతో దుష్పచారానికి" పాల్గపడ్డరని ఈ ఫిర్యాదులో కేటీఆర్ పెర్కొన్నారు. అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి ఇటువంటి బాధ్యతారహితమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజా ప్రతినిధుల విశ్వసనీయత, గౌరవానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా ఈ ఫిర్యాదు నొక్కి చెప్పింది.

కేటీఆర్ డిమాండ్ చేసిన పరిహారాలు..

బండి సంజయ్ నుండి బేషరతుగా, బహిరంగ క్షమాపణ. తదుపరి పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిందితులను నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలని విజ్జప్తి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా పోర్టల్‌ల నుండి పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలి.

Next Story