నూతన సర్పంచులకు కేటీఆర్ అభినందన

రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

By -  Medi Samrat
Published on : 13 Dec 2025 5:27 PM IST

నూతన సర్పంచులకు కేటీఆర్ అభినందన

రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో పలు జిల్లాల నుంచి తరలివచ్చిన నూతన సర్పంచులు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వందలాదిగా తరలివచ్చిన సర్పంచులు, పార్టీ నేతలతో కేటీఆర్ నివాసం కోలాహలంగా మారింది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని బలప్రయోగం చేసినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రజలు మాత్రం భారత రాష్ట్ర సమితి వెంటే నిలిచారని అన్నారు. మొదటి దశ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు భారీగా గెలవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చిన ప్రతి ఒక్కరి పోరాట పటిమను ఆయన అభినందించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు పదుల సంఖ్యలో విజయం సాధించడం గమనార్హం. కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గెలిచిన సర్పంచులు కేటీఆర్‌ను కలిశారు. "స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇంత పెద్ద ఎత్తున మన సర్పంచులు గెలవడం.. కాంగ్రెస్ పాలన పట్ల ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతకు, బీఆర్ఎస్ పట్ల ఉన్న ప్రజా సానుకూలతకు నిదర్శనం," అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

వరుసగా వారం, పది రోజులు సర్పంచులతో భేటీ

ఈరోజు నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల నుంచి వచ్చిన సర్పంచులు కేటీఆర్‌ను కలిశారు. రానున్న వారం, పది రోజుల పాటు కేటీఆర్ వరుసగా వివిధ జిల్లాల నుంచి వచ్చే నూతన సర్పంచులను కలుసుకోనున్నారు. వారిని సత్కరించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, వివిధ జిల్లాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story