కేటీఆర్ సవాల్.. సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించేనా.?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
By - Medi Samrat |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 66 శాతం ప్రజలు కాంగ్రెస్‌తోనే ఉన్నారని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను తప్పుబట్టారు. నిజంగా అంత మద్దతు ఉంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. అప్పుడు తెలంగాణ ప్రజానీకం ఎవరి వైపు ఉందో తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా మాటలు మారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు మాటమార్చి బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని చెబుతున్నారని విమర్శించారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో కడియం, పోచారం ఉన్నారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనీసం 10 సీట్లు కూడా గెలవలేదని, ఇప్పుడు బీఆర్ఎస్ 80 గ్రామాల్లో విజయం సాధించిందన్నారు కేటీఆర్. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి, ఎన్నికల నాటి విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లలో ఉన్న 57 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్‌పై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ గెలుపును చూసి కాంగ్రెస్ ఆందోళన చెందుతోందని అన్నారు. ఓటమి పాలైన అభ్యర్థులు ధైర్యంగా ఉండాలని, రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు.