బీఆర్ఎస్.. బీజేపీకి దగ్గరవ్వాలని అనుకుంటూ ఉందా..?

Is BRS extending an olive branch to BJP? KTR’s Delhi visit sparks rumours. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు న్యూఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకులతో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jun 2023 10:12 AM GMT
బీఆర్ఎస్.. బీజేపీకి దగ్గరవ్వాలని అనుకుంటూ ఉందా..?

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు న్యూఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకులతో సమావేశాలు జరిపారు. ఈ సమావేశాల కారణంగా రెండు పార్టీల మధ్య అంతరాన్ని తగ్గిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈ సమావేశాలను స్థానిక కాంగ్రెస్, బీజేపీ నేతలు నిశితంగా గమనిస్తూ ఉన్నారు. హైదరాబాద్‌లో కూడా రాజకీయంగా తీవ్ర చర్చ సాగుతూ ఉంది. త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. రాజకీయ సమీకరణాలు మారబోయే అవకాశాలు కూడా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అయిన కేటీఆర్:

కెటి రామారావు తన న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లతో సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మెట్రోరైలు, ఎక్స్‌ప్రెస్‌వే వంటి పనులకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ చేపట్టాలనుకుంటున్న అభివృద్ధి పనులను కూడా ప్రస్తావించారు. దేశాభివృద్ధికి అత్యున్నత సహకారం అందిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

బీఆర్ఎస్ కు బీజేపీకి రహస్య ఒప్పందం: కాంగ్రెస్

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ఢిల్లీ పర్యటనే అందుకు నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ సభ్యుడు మహ్మద్ అలీ షబ్బీర్ ఆరోపించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. 'రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎందుకు కలవలేదు, పలకరించలేదు? ఇప్పుడు ఈ ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అభివృద్ధి నిధుల కోసం మంత్రులను కలుస్తామని చెబుతున్నా పొత్తు పెట్టుకోవడమే అసలు ఉద్దేశమని అన్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం మౌనమే ఇందుకు నిదర్శనమని అన్నారు.

కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి నిరాకరించిన బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీతో అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీని ఎమ్మెల్సీ కె కవిత ప్రశంసించడం గమనించవచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని సంప్రదించడానికి ప్రయత్నించింది, కానీ వారి నుండి ఎటువంటి స్పందన లేదు. అందుకే ఇప్పుడు బీజేపీతో ముందుకు వెళ్లాలని యోచిస్తోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపని బీజేపీ నేతలు:

రాష్ట్రంలో బీజేపీ నేతలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ డీలా పడిపోయిందని అంటున్నారు. తెలంగాణ రాజకీయ పోరులో బీజేపీ వెనుకబడిందని రాజకీయ విశ్లేషకుడు పి రాఘవేంద్రరెడ్డి అన్నారు. “కాంగ్రెస్ రాష్ట్రంలో ఎదగడానికి ప్రయత్నిస్తోంది.. ఆ పార్టీ నాయకుల్లో జోష్ కనిపిస్తూ ఉంది. కానీ ఆ ఉత్సాహం బీజేపీలో లేదు. అంతేకాకుండా బీఆర్‌ఎస్‌పై కేంద్రంలో ఉన్న బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోంది’’ అని ఆయన అన్నారు. "కేటీఆర్‌ సమావేశం మాత్రమే కాదు, మహారాష్ట్రలో బీజేపీ గురించి సీఎం కేసీఆర్ కూడా భిన్నంగా మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని తన 'సన్నిహితుడు' అని చెప్పుకుంటున్నారు కేసీఆర్. ఆయన ఇటీవలి కాలంలో చేసిన ప్రసంగాలు BRS ఆయన బీజేపీకి దగ్గరవ్వాలని భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. కానీ కాలంతో పాటు సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున ఏ పార్టీతో ఎవరు జట్టు కడతారో అన్నది ఊహించడం తొందరపాటు అవుతుంది” అని రాఘవేంద్రరెడ్డి వివరించారు.


Next Story