రేవంత్ ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైంది..కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఆగ్రహం

పోలవరం, నల్లమల్లసాగర్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హరీశ్ రావు స్పందించారు

By -  Knakam Karthik
Published on : 12 Jan 2026 3:23 PM IST

Telangana, Harishrao, Cm Revanthreddy, Congress, Brs, Supreme Court,  Polavaram, Nallammallasagar, AP Cm Chandrababu

రేవంత్ ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైంది..కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఆగ్రహం

హైదరాబాద్: విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహ బుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైంది..అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే, ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది..అని మండిపడ్డారు.

ఈ మాత్రం విషయం మీ న్యాయవాది, మీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ గారికి తెలియదా? అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. ఈ మాత్రం దానికి నీళ్ల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూటు బూటు వేసుకొని ఢిల్లీ దాకా వెళ్లాలా? అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న చారిత్రక ద్రోహం ఇది అని హరీశ్‌ రావు ఆరోపించారు. రిట్ ఉపసంహరించుకొని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమే. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథే అని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.

ఈ లోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని, తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకు పోతుంది. సంక్రాంతి పండుగ వేళ రేవంత్ చంద్రబాబుకు ఇచ్చిన గిఫ్ట్.. సుప్రీం కోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్టు. పోలవరం నల్లమల సాగర్ విషయంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నది. పోను పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు డిల్లీ మీటింగ్ కు వెళ్ళాడు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపాడు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశాడు. వేయను అంటూనే కమిటి వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశాడు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టు కు వెళ్ళి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటించాడు..అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

Next Story