గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని మంత్రి సీతక్క వెల్లడించారు. సొంత భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాది రూ.12 వేల ఆర్థిక చేయూతను అందించబోతున్నట్లు చెప్పారు. కుటుంబంలో ఉండే ఉపాధి హామీ మహిళా కూలీ బ్యాంకు అకౌంట్‌లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని జమ చేస్తామని స్పష్టం చేశారు. గ్రామ సభ వేదిక ద్వారానే అర్హులను గుర్తించి, లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆమె అధికారులను ఆదేశించారు. శాంతియుత వాతావరణంలో గ్రామ సభలు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గ్రామ సభ నిర్ణయమే ఫైనల్ అని మంత్రి సీతక్క వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై అనవసర రాజకీయాలు తగదని ఆమె స్పష్టం చేశారు. కూలీలకు రూపాయి సహాయం చేయని బీఆర్ఎస్ పెద్దలు కూడా తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. రైతులకు, కూలీలకు పంచాయితీ పెట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అర ఎకరం ఉన్న రైతు కన్నా.. ఏ భూమి లేని కూలీకే అధిక లబ్ధి చేకూరుతుందని అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతులకు రుణమాఫీ చేయని బీఆర్ఎస్ వారిపై ముసలి కన్నీరు కారుస్తుందని ఎద్దేవా చేశారు. కూలీ భరోసాను విఫలం చేసే కుట్రకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని మంత్రి సీతక్క ఆరోపించారు. గ్రామ సభల్లో కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశముందన్న ఆమె, కూలీలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.