తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జనవరి 26 నుంచి రాష్ట్రంలో మరో 3 కొత్త పథకాలు ప్రారంభించనుంది. రైతులకు రైతు భరోసా స్కీమ్‌తో పాటు రైతు కూలీలకు ఇందిర ఆత్మీయ భరోసా పథకం, ఇక మూడోది రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కొత్త రేషన్ కార్డుల పంపిణీికి అదే రోజు శ్రీకారం చుట్టనుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన సర్వేలు చివరి దశకు చేరుకున్నాయి. ఆ ప్రక్రియలో భాగంగా, పల్లెల్లో కొత్త రేషన్ కార్డులు పొందినవారి లిస్టును అధికారులు సిద్ధం చేశారు. అయితే ఈ జాబితాల్లో తమ పేర్లు లేవని చాలా మంది ఆందోళన చెంది అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇన్నాళ్లూ రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన వారు తమకు రాదేమో అని కంగారుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
తెలంగాణలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. పాత రేషన్ కార్డులు తొలగిస్తామని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. పాత రేషన్ కార్డులు అలాగే కంటిన్యూ అవుతాయన్న ఆయన, దరఖాస్తు చేసుకున్నట్లయితే పాత రేషన్ కార్డుల్లో.. కొత్త వారిని కూడా చేరుస్తామని వివరణ ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కుల గణన ఆధారంగానే రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే లిస్టులో పేర్లు లేని వారు టెన్షన్ పడొద్దని, గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మంత్రి స్టేట్‌మెంట్‌తో ప్రస్తుతం లిస్టులో పేర్లు లేని వారికి ఉపశమనం కలిగింది.