సినిమా థియేటర్లలో కంటే..సచివాలయంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తోంది: హరీశ్‌రావు

తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు

By -  Knakam Karthik
Published on : 11 Jan 2026 3:04 PM IST

Telangana, Hyderabad, Harishrao, Brs, Congress Government, Cm Revanth, Komatireddy Venkatreddy

సినిమా థియేటర్లలో కంటే..సచివాలయంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తోంది: హరీశ్‌రావు

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది..అని ప్రశ్నించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు..అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

సీఎం రేవంత్ మీరు నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా..అని ప్రశ్నించారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయం..అని హరీశ్ రావు విమర్శించారు. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు. చెప్పేదొకటి, చేసేది మరొకటి..పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారు? నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టినవ్. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్.. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు. ఇవాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా..అని హరీశ్‌ రావు ప్రశ్నించారు.

ఇక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోంది అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు. ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు ? టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కోమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారు . అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా.. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు..అని హరీశ్‌ రావు ప్రశ్నించారు.

Next Story