తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. హరీష్ రావుతో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావులపై చర్యలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తూ, గతంలో ఈ కేసుకు సంబంధించి ఉన్న న్యాయ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేసింది.
కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు (కాంగ్రెస్, బీజేపీ), వ్యాపారవేత్తలు, కొందరు సెలబ్రిటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ అంశంపై ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు తదితరులు కీలక నిందితులుగా ఉన్నారు.