కులగణన సర్వే కుట్రపూరితంగా చేశారు: మాజీ మంత్రి తలసాని
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను కుట్ర పూరితంగానే చేపట్టిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
By Knakam Karthik
కులగణన సర్వే కుట్రపూరితంగా చేశారు: మాజీ మంత్రి తలసాని
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను కుట్ర పూరితంగానే చేపట్టిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్‌తో పాటు గ్రామాల్లో కూడా కుల గణన సరైన రీతిలో జరగలేదని అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది ఎక్కడ పోయారో అసలు లెక్కనే లేదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్కలు చూస్తే కూడా.. మిగతా వాళ్లు ఎక్కడికి పోయారు అనేది క్లారిటీ లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ కుల గణన సర్వేను కొత్తగా చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసి పంపితే ఎలాంటి లాభం లేదని మాజీ మంత్రి తలసాని అభిప్రాయం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన ఫైనాన్స్ కమిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని అన్నారు. 1.35 శాతం జనాభా పెరుగుదల ఉంటుందని, 57 శాతం బీసీ జనాభా ఉంటుందని చెప్పారు. ఆదరాబాదరగా స్థానిక ఎన్నికలకు వెళ్లకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరో వైపు కులగణన సర్వేలో పాల్గొనని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సమగ్ర ఇంటింటి సర్వేలో వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కోరితే అధికారులు ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారని అన్నారు. మండల కార్యాలయాల్లో ప్రజా పాలన అధికారులు ఈ పది రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.