కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ: హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతోనే మళ్లీ సాగు, తాగునీటి గోసలు నెలకొంటున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 15 Feb 2025 11:47 AM IST
కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ: హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతోనే మళ్లీ సాగు, తాగునీటి గోసలు నెలకొంటున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఒకప్పుడు భూగర్భ జలాల పరిరక్షణకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రంలో 2013-23మధ్య పెరిగిన భూగర్భ జలాలు..ప్రస్తుతం పడిపోయిన భూగర్భ జల మట్టాల లెక్కల కథనాన్ని హరీష్ రావు ఎక్స్ లో ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో 2013 నుండి 2023 వరకు భూగర్భజలాలు 56% పెరుగుదలతో దేశంలోనే అత్యధికంగా భూగర్భజలాలు పెరిగాయన్నారు. కేసీఆర్ హయాంలో మిషన్ కాకతీయ ఈ విజయంలో కీలక పాత్ర పోషించిందని, 27,000 ట్యాంకులను పునరుద్ధరించడం, 15 లక్షల ఎకరాలకు సాగునీటిని పెంపొందించడంతో 8.93 టీఎంసీ అడుగుల నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో రైతులు అభివృద్ధి చెందారని.. సాగునీరు అభివృద్ధి చెందిందని..అలాగే తాగునీటి సరఫరా బలోపేతం చేయబడిందని తెలిపారు.
అయితే కేవలం 14 నెలల కాంగ్రెస్ పాలనలో అంతా తారుమారైందన్నారు. పలు జిల్లాల్లో 2 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయని.. యాదాద్రి భువనగిరిలో 2.71 మీటర్ల లోతుకు పడిపోగా, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లో కూడా భయంకరమైన భూగర్భ జల మట్టం క్షీణత కనిపిస్తోందని వెల్లడించారు.
గోదావరి నది ఎండిపోతోందని..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణతో ఒకప్పుడు 120 కి.మీ నది గర్భం నీటితో కళకళలాడిందని, ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యంతో వట్టిపోయి కనిపిస్తుందన్నారు. తాగునీటి సరఫరా కోసం చేపట్టిన మిషన్ భగీరథ పనులు విఫలమవుతున్నాయని, పెరుగుతున్న కరెంటు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ప్రస్తుతం బోరు బావులపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు. బలమైన సాగునీటి, నీటి యాజమాన్య వ్యవస్థ ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ వారసత్వంగా పొందింది కానీ ఇప్పుడు తెలంగాణను భూగర్భ జలాల సంక్షోభం వైపు నెట్టివేసి, తన అసమర్థతతో రిజర్వాయర్లలో నీటి నిల్వలను తరిమికొడుతోందని హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు.
Telangana, once a model for groundwater conservation, is now staring at a crisis—due to Congress’s negligence.Under KCR’s leadership, the state saw the highest groundwater rise in the country, with a 56% increase in groundwater levels from 2013 to 2023. Mission Kakatiya… pic.twitter.com/Hc5XLz3aYI
— Harish Rao Thanneeru (@BRSHarish) February 15, 2025