ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది: సీఎం రేవంత్
క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌ను కలిశారు.
By - Knakam Karthik |
ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది: సీఎం రేవంత్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌ను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకొచ్చారు. కాగా సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం పని చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ...భారత్ జోడో పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశంలోని మైనార్టీలకు ఒక భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎనిమిది చోట్ల డిపాజిట్ రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసింది. మోదీ కి మద్దతు ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరం. కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్లే. జూబ్లీహిల్స్ లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోంది. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు.? దేశం కోసం సర్వం త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ని ఈడీ ఆఫీసు కు పిలిచి విచారణ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును మాత్రం విచారణ కు పిలవడం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉంది. గతంలో కవిత నే ఈ విషయాన్ని స్పష్టం చేసింది..అని రేవంత్ అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసేందుకు జూబ్లీహిల్స్‌ను ప్రయోగశాలగా చూస్తున్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క దళితుడే మంత్రిగా ఉన్నాడు. మా మంత్రి వర్గంలో నలుగురు దళితులకు మంత్రులుగా అవకాశం కల్పించాం. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ కి అవకాశం ఇచ్చాం. అత్యంత నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానం. జూబ్లీహిల్స్ లో మోదీ, కేసీఆర్ ఒక వైపు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మరో వైపు నిలబడ్డారు..అని సీఎం పేర్కొన్నారు.