ఆ సభలో కేసీఆర్‌కు నాపేరు పలికే ధైర్యం రాలేదు: సీఎం రేవంత్
కేసీఆర్ వరంగల్ వెళ్లి ఆయన పాపాలు కడిగేసుకున్నా అనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారు..అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik
ఆ సభలో కేసీఆర్‌కు నాపేరు పలికే ధైర్యం రాలేదు: సీఎం రేవంత్
కేసీఆర్ వరంగల్ వెళ్లి ఆయన పాపాలు కడిగేసుకున్నా అనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారు..అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శ్రీ మహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పని చేస్తోంది. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవన్న. బసవేశ్వర స్ఫూర్తితోనే పంచాయతీ రాజ్ పార్లమెంటరీ వ్యవస్థను మనం తెచ్చుకున్నాం. ప్రతీ మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలను ఎత్తి చూపేందుకే ప్రతిపక్షం అనే వ్యవస్థ ఉంది. మొన్న ఒకాయన వరంగల్ లో సభ పెట్టి కాంగ్రెస్‌ను విమర్శించారు. వాళ్లు రజతోత్సవాలు , విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. వరంగల్ సభలో మేం చేసిన మంచిని అభినందించి ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు ఆయన్ను అభినందించే వాళ్లు. ఇన్నాళ్లుగా ఆయన ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారు.. ఇది ఏ చట్టంలో ఉంది? ప్రతిపక్ష నాయకుడిగా రూ. 65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారు. మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫామ్ హౌస్ లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు?..అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
సంక్షేమ పథకాలు ఆగిపోయాయని కేసీఆర్ మాట్లాడారు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది?. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం.. ఇవేవీ మీకు కనిపించడంలేదా?. మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలి. కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేష పూరితప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు?. ప్రజలు విజ్ఞులు.. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేద్దాం రండి. కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, మేం ఇచ్చిన 60 వేల ఉద్యోగాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వీటిలో దేనిపై చర్చ చేద్దాం చెప్పండి కేసీఆర్?. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ మాటల్లో.. కళ్ళల్లో విషం కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిదా?. పదేళ్లు దోచుకున్న మీకు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదు. ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు కెసిఆర్ వరంగల్ వెళ్లారు. ఆయన వరంగల్ వెళ్లి పాపాలు కడిగేసుకున్నానుకుంటున్నారు.. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారు . వరంగల్ సభలో నా పేరు కూడా పలకలేకపోయారు..అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.