మన పథకాలతో మోడీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు..అందుకే రంగంలోకి దిగారు: సీఎం రేవంత్

ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 15 April 2025 3:11 PM IST

Telangana, Cm Revanthreddy, Congress CLP Meeting, Pm Modi, Bjp, Hcu, Brs

మన పథకాలతో మోడీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు..అందుకే రంగంలోకి దిగారు: సీఎం రేవంత్

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. శంషాబాద్ నోవోటెల్‌ హోటల్‌లో సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్న బియ్యం పథకం ఒక అద్భుతం. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం. భూ భారతిని రైతులకు చేరవేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది. క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి..అని సీఎం అన్నారు.

కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం. ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం. జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా. హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. అని సీఎం విమర్శించారు.

పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోడీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్గీకరణ మోడీకి గుదిబండగా మారింది. కులగణన మోడీకి మరణశాసనం రాయబోతోంది. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. సన్న బియ్యం మన పథకం, మన పేటెంట్, మన బ్రాండ్.. అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story