భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న తెలంగాణలోని జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబా-నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు బుధవారం రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాలపై మరోసారి సహాయ, పునరావాస కార్యక్రమాలు, ఆస్తి, ప్రాణ నష్టం నివారణపై చేపట్టిన చర్యలను సమీక్షించారు. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్సర్వీసుల శాఖ డీ.జి నాగిరెడ్డి, వరద బాధిత జిల్లాలకు నియమితులైన స్పెషల్ అధికారులు కూడా ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.