తెలంగాణ మంత్రివర్గ విస్తరణ లేనట్లే..సీఎం రేవంత్ ప్రకటన
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడారు.
By Knakam Karthik
బ్రేకింగ్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ లేనట్లే..సీఎం రేవంత్ ప్రకటన
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడారు. కేబినెట్‌లో ఎవరు ఉండాలో అధిష్టానానిదే నిర్ణయమని అన్నారు. తాను ఎవరి పేరునూ ప్రతిపాదించడంలేదని ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళ్తామని, త్వరగా అరెస్ట్ చేయించి జైలులో వేయాలనే ఆలోచన లేదని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పని చేస్తున్నానని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు.
రాష్ట్రంలో కుల గణన ఆషామాషీగా చేసింది కాదని, ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చేసిందని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో బీసీలు ఐదున్నర శాతం పెరిగారని, ఈ విషయంలో బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ శాసనసభలోనే లెక్కలతో సహా చూశాక ఒప్పుకున్నాడని అన్నారు. తాము చేపట్టిన సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వతం పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. అటు పీసీసీ కార్యవర్గ కూర్పు కూడా కొలిక్కివచ్చిందని, ఒకటి రెండు రోజుల్లో ప్రకటన కూడా ఉంటుందని చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ తీసుకునే దాదాపు అన్ని కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయని, వారికి తెలియకుండా నిర్ణయాలు ఉంటాయని.. తెలియని వాళ్లు అనుకుంటే చేసేదేమీ లేదని సీఎం రేవంత్ బదులిచ్చారు. పార్టీ, నేతల మనోభావాలకు అనుగుణంగానే ఉంటాను తప్ప.. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవని చెప్పారు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ చెప్పారు. పని చేసుకుంటూ పోవడమే తనకు తెలుసని.. ప్రతి ఒక్క విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ అన్నారు.