రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం : సీఎం రేవంత్

దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat
Published on : 4 July 2025 3:09 PM IST

రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం : సీఎం రేవంత్

దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కుల గణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామ‌న్నారు. అలాగే.. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో కూడా మనం చాలా విజయాలు సాధించామ‌ని పేర్కొన్నారు.

నేను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. యూత్ కాంగ్రెస్, NSUI, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయి.. పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు అన్నారు. పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవం.. రాజకీయాల్లో మీ ఎదుగుదలకు ఇవి ఉపయోగపడుతాయ‌న్నారు.

రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి.. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయి.. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలన్నారు. మీరు నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి.. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలి.. మనందరం కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలని.. రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం అన్నారు. సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేది.. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలి.. పార్టీ పదవితోనే అందరికీ గౌరవం, గుర్తింపు అన్నారు.

Next Story