ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే దళితులకు అవకాశాలు: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందే కాబట్టే దళితులకు అవకాశాలు వచ్చాయి..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik
ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే దళితులకు అవకాశాలు: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందే కాబట్టే దళితులకు అవకాశాలు వచ్చాయి..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జగ్జీవన్‌రాం భవన్‌లో గురుకుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. కోఠిలోని మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసుకుంటున్నట్లు తెలిపారు. పాలితులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. చాలామంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదు, చదువు మాత్రమేనని, ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువులతోనే సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.
కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు, మౌలిక వసతులు కూడా బాగుండాలని సీఎం వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు చదువులు వద్దు.. కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, బీసీలు.. గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్లుగా మాజీ సీఎం వ్యవహరించారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే.. ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై నీళ్లు చల్లారని, మాజీ సీఎం తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు గానీ, రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 15 నెలల్లోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాల భర్తీ త్వరగా పూర్తయితే ఉద్యోగం రానివారు మరో పని చూసుకుంటారని అన్నారు. ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. నోటి కాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్లుగా కేసులు వేస్తున్నారని, ఉద్యోగాలను అడ్డుకుంటున్న వారిని ప్రజలు నడి రోడ్డుపై నిలదీయాలని రేవంత్ రెడ్డి అన్నారు.