సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎలా స్పందిస్తారో.?

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.

By Medi Samrat  Published on  27 Jun 2024 10:36 AM IST
సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎలా స్పందిస్తారో.?

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) వార్షిక ప్రణాళికకు నిధులు మంజూరు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించాలని కోరారు.

రేవంత్ రెడ్డి ఢిల్లీలో నితిన్ గడ్కరీతో సమావేశమై జాతీయ రహదారుల విస్తరణ, కొత్త జాతీయ రహదారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ రహదారులుగా ప్రకటించిన రోడ్ల పనుల ప్రారంభంపై కేంద్ర మంత్రికి వివరించారు. జాతీయ రహదారిగా ప్రకటించిన సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-జగ్‌దేవ్‌పూర్‌-భోంగిర్‌-చౌటుప్పల్‌ రోడ్డుకు 158.645 కిలోమీటర్ల భూసేకరణ ఖర్చులో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేంద్రమంత్రికి వివరించారు. చౌటుప్పల్‌ నుంచి ఆమన్‌గల్‌-షాద్‌నగర్‌-సంగారెడ్డి వరకు ఉన్న 181.87 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని గడ్కరీని కోరారు.

హైదరాబాద్‌ (ఓఆర్‌ఆర్‌ గౌరెల్లి జంక్షన్‌) నుంచి వలిగొండ-తొర్రూరు-నెల్లికుదురు-మహబూబాబాద్‌-కొత్తగూడెం వరకు మంజూరైన జాతీయ రహదారికి 69 కిలోమీటర్ల మేర ఒక్క ప్యాకేజీ మాత్రమే ఉండగా.. టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారని సీఎం రేవంత్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఇది పూర్తయితే హైదరాబాద్‌-భద్రాచలం మధ్య 40 కి.మీ దూరం తగ్గుతుందని, ఈ రహదారిని జై శ్రీరామ్‌ రోడ్డుగా పిలుస్తామని వరంగల్‌ బహిరంగ సభలో నితిన్‌ గడ్కరీ చేసిన ప్రకటనను గుర్తు చేశారు. ఈ జాతీయ రహదారికి సంబంధించి మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు.

జగిత్యాల-పెద్దపల్లి-మంథని-కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని.. అందుకు తగిన నిధులు కేటాయించాలని నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మంథని హైవే ఎన్‌హెచ్‌-565, ఎన్‌హెచ్‌-353సీలను కలుపుతుందని.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రజలు ప్రయాణించేందుకు సౌకర్యంగా ఉంటుందని కేంద్ర మంత్రికి తెలంగాణ సీఎం వివరించారు.

Next Story