కాకా వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివేక్, వినోద్ లను చూసినపుడు నాకు రామాయణంలో లవ కుశులు గుర్తొస్తారు. ఎంత సంపాదించామనేది కాదు.. సమాజానికి ఎంత పంచామనేది.. సామాజిక బాధ్యత అనేది.. కాకా విధానం అన్నారు. గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత కాకా సొంతమన్నారు. దేశ నిర్మాణంలో ఆయన వారి సామాజిక బాధ్యతను నిర్వర్తించారని పేర్కొన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిది అని కొనియాడారు. నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తే ఖచ్చితంగా గమ్యాన్ని చేరొచ్చన్నారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచారని ఉదహరించారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని పేర్కొన్నారు. దేశంలో గాంధీ కుటుంబంలా.. రాష్ట్రంలో కాకా కుటుంబం కాంగ్రెస్ కు అండగా ఉంటుందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు మేం అండగా ఉంటామన్నారు.