మోడీ చేస్తే న్యాయం, మేం చేస్తే అన్యాయమా?: సీఎం రేవంత్

వర్షాలకు హైదరాబాద్ మునిగిపోకుండా ఉండేందుకే హైడ్రా పని చేస్తుంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

By Knakam Karthik
Published on : 8 May 2025 7:45 PM IST

Hyderabad News, Cm Revanthreddy, Hydra Police Station, Congress Government, Brs,Bjp

మోడీ చేస్తే న్యాయం, మేం చేస్తే అన్యాయమా?: సీఎం రేవంత్

వర్షాలకు హైదరాబాద్ మునిగిపోకుండా ఉండేందుకే హైడ్రా పని చేస్తుంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుద్ధభవన్‌లో హైడ్రా తొలి పోలీస్ స్టేషన్‌ను సీఎం ప్రారంభించిన తర్వాత మాట్లాడారు. మన పూర్వీకులు మనకు ఇచ్చిన చెరువులను కాపాడుకోవాలి. చెరువులు కనుమరుగైతే మనకు మనుగడ ఉండదని, 450 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్​ నగరాన్ని కాపాడుకునేందుకు హైడ్రా ఉపయోగపడుతోంది. 76 ఏళ్లలో రాజ్యాంగాన్ని 100 సార్లకు పైగా సవరించుకున్నాం. మంచి పరిపాలన అందించేందుకే రాజ్యాంగాన్ని అన్నిసార్లు సవరించుకున్నాం. నగరాభివృద్ధి కోసం గత ముఖ్యమంత్రులు ఎన్నో చట్టాలు చేశారు. 1908లో హైదరాబాద్‌లో వచ్చిన వరదలు చూసి అప్పటి నిజాం కన్నీరు పెట్టుకున్నారు. కన్నీరు పెట్టుకున్న నిజాం హైదరాబాద్‌కు మళ్లీ అలాంటి పరిస్థితి రావొద్దని భావించారని, గొప్ప ఇంజినీరు మోక్షగుండం విశ్వరయ్యను పిలిపించి హైదరాబాద్‌లో మూసీపై డ్రైనేజీ వ్యవస్థ నిర్మించారు. పాతబస్తీ అంటే వెనుకబడిన ప్రాంతంగా పేరు స్థిరపడిపోయిందని, ఓల్డ్‌ సిటీ అంటే ఒరిజినల్‌ సిటీ అని భావించి అభివృద్ధి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

బెంగళూరులో గత ఏడాది వేసవిలో నీటికరువు వచ్చిందని, చెన్నై, ముంబయి వంటి నగరాల్లో వరదలు వస్తే2, 3 అంతస్థుల భవనాలు మునిగిపోతున్నాయని సీఎం గుర్తు చేశారు. దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం పెరిగిపోయి జీవించలేని పరిస్థితి ఏర్పడిందని, మెట్రో పాలిటన్‌ నగరాల్లో జీవించలేని పరిస్థితులు ఉన్నాయని, హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రానీయొద్దని భావించామని అన్నారు.

హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేశారని, హైడ్రా అంటే ప్రభుత్వ, ప్రజల ఆస్తులు రక్షించేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చిన్న వర్షం వస్తే నగరంలో కాలనీలు మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కాలనీలకు వెళ్లే దారులను పెద్దలు ఆక్రమిస్తున్నారని, కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, కాలనీల రోడ్లను హైడ్రా రక్షిస్తోందని తెలిపారు. వర్షం వస్తే రోడ్లపై కూలిన చెట్లను హైడ్రా నిమిషాల్లోనే తొలగిస్తోందని, నాలాల ఆక్రమణ వల్లే చెరువుల్లోకి వెళ్లాల్సిన నీరు రోడ్లపై నిలుస్తోందని, లేక్ వ్యూ మోహంతో చెరువుల పక్కన ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు నిర్మించుకున్నారని, ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌ల నుంచి వ్యర్థాలు, నీటిని చెరువుల్లోకి వదులుతున్నారని తెలిపారు. చెరువులు, నాలాలు ఆక్రమించిన వారికే హైడ్రా అంటే భయమని, మూసీని ప్రక్షాళన చేసి నగర వాసులకు మంచి జీవితం ఇవ్వాలని భావించామని అన్నారు.

బీజేపీ ప్రభుత్వం గంగానది, యుమనా నదిని ప్రక్షాళన చేయటం లేదా? నదుల ప్రక్షాళనను బీజేపీ చేస్తే ఒప్పు మేం చేస్తే తప్పా? మోదీ, యోగి చేస్తే గొప్ప తెలంగాణ ప్రజలు చేసుకుంటే తప్పా? మోదీ చేస్తే గొప్ప తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పా అని సీఎం ప్రశ్నించారు. మూసీలో బతకాలని ఎవరూ కోరుకోరు. మీరు జన్వాడ, ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ల ఉండొచ్చు కానీ..పేదలు మూసీలో ఉండాలా?. మోడీ చేస్తే ఒక న్యాయం, మేం చేస్తే అన్యాయమా? మూసీ పరీవాహక ప్రాంతాల్లో మా నేతలు తొందర‌లోనే సందర్శిస్తారు. హైడ్రా పేదల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి. పెద్దల పట్ల కఠినంగా వ్యవహరించండి. మీకు అండగా నేను ఉంటా..అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Next Story