ఫామ్ హౌజ్‌లో కూర్చొని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు: సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో కూర్చుని కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:35 PM IST
ఫామ్ హౌజ్‌లో కూర్చొని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు: సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో కూర్చుని కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని, చేసింది చాలు.. ఇక ఫామ్‌హౌజ్‌లో రెస్ట్ తీసుకొమ్మని ప్రజలు తీర్పునిచ్చారని సీఎం రేవంత్ అన్నారు. అయితే, ప్రజలు తిరస్కరించినా.. కేసీఆర్‌లో మార్పు రాలేదని మండిపడ్డారు. రాష్ట్రంతో పేగుబంధం తెంపుకుంటూ పార్టీ పేరు కూడా మార్చుకున్నారని సీఎం రేవంత్ అన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయలేని వాళ్లకి మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఏ అభ్యర్థికి ఓటెయ్యాలని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారో చెప్పాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే ఆ పార్టీలో పోటీ చేసే అభ్యర్థులే లేరని, బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హతే లేదని ఎద్దేవా చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చాకే 55,163 నియామకాలు చేపట్టిందన్నారు. తెలంగాణ సాధనలో పట్టభద్రులదే కీలక పాత్ర అని అన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటేయ్యాలన్నారు.
మిగుల్ బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారు. ఆ అప్పులకు ప్రతి నెలా రూ.600 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం. కేసీఆర్ పాలనలో ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రాలేదు. ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కేసీఆర్ రూ.8 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు అని.. సీఎం రేవంత్ ఆరోపించారు. దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి చేశాం. వందేళ్లుగా జరగని కులగణనను సమర్థంగా నిర్వహించాం.. అని సీఎం రేవంత్ అన్నారు.