వైఖరి మారకపోతే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కనిపించకుండా పోవడం ఖాయం : సీఎం రేవంత్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

By -  Medi Samrat
Published on : 14 Nov 2025 6:36 PM IST

వైఖరి మారకపోతే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కనిపించకుండా పోవడం ఖాయం : సీఎం రేవంత్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వ‌హించిన‌ మీడియా స‌మావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ గెలుపులో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. పీసీసీ నాయకత్వ స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఏకతాటిపై నిలిచి, ఐక్యంగా పని చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తి ఆపలేదని ఈ ఫలితాలు రుజువు చేశాయని.. ఈ గెలుపు కార్యకర్తలకు అంకితం అన్నారు.

ఈ గెలుపు హైదరాబాద్ నగర అభివృద్ధి పట్ల, ఇక్కడ పేదల సంక్షేమం పట్ల మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. రెండేళ్లుగా నగరాభివృద్ధికి సంబంధించిన మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫోర్త్ సిటీ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు వంటి మా ఆలోచన, విజన్, కార్యచరణకు ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు ఆమోదం తెలిపారని.. వచ్చే మూడేళ్లు ఆ దిశగా నిరంతరం పని చేయడానికి ఈ ఎన్నికల ఫలితాలు మాకు సరికొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయం.. వచ్చే మూడేళ్లు అభివృద్ధి.. పేదల సంక్షేమమే మా మంత్రం అని పేర్కొన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ఇక మా బాధ్యత అని ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు.

ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ.. కేటీఆర్‌కు అహంకారం, హరీశ్ రావుకు అసూయ ఎక్కువగా ఉన్నాయని.. వాటిని తగ్గించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. అయినా బుద్ధి రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. అప్పటికీ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మళ్లీ బుద్ధి చెప్పారు’ అంటూ కేటీఆర్ , హరీష్ రావుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వరుస ఓటముల తర్వాత కూడా వారి వైఖరి మారకపోతే.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కనిపించకుండా పోవడం ఖాయం అని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని.. ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రతిపక్ష నేతలకు సూచించారు.

Next Story