పదవుల కోసం వైఎస్, చంద్రబాబు దగ్గర ఊడిగం చేశారు : బీఆర్ఎస్‌పై సీఎం సంచలన కామెంట్స్
విచారణ కమిషన్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని.. కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ వాళ్లు కోర్టుకు వెళ్లారని.. అందుకు చైర్మన్ వైఖరిని కారణంగా చూపారని బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 29 July 2024 2:56 PM ISTవిచారణ కమిషన్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని.. కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ వాళ్లు కోర్టుకు వెళ్లారని.. అందుకు చైర్మన్ వైఖరిని కారణంగా చూపారని బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కమిషన్ ను రద్దు చేయడం కుదరదని.. చైర్మన్ పై అభ్యంతరం ఉంటే చైర్మన్ ను మార్చాలని కోర్టు స్పష్టంగా చెప్పింది.. కోర్టు కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిందన్నారు. 2015లో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును రూ.7,290 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టారని.. 2017లో ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.. కానీ అది 2022లో పూర్తి చేశారు.. ప్రాజెక్టు వ్యయం రూ.10,515 కోట్లకు పెంచారని.. భద్రాద్రి ద్వారా ఒక మెగావాట్ ఉత్పత్తికి రూ. 9కోట్ల 73లక్షలు పడుతోందన్నారు. 25 వేల కోట్ల అంచనా వ్యయంతో యాదాద్రి ప్రాజెక్టు ప్రారంభించారన్నారు. 2020లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.. కానీ 2024 వచ్చినా ప్రాజెక్టు పూర్తి కాలేదు.. కానీ అంచనా వ్యయం రూ.34,548కి పెరిగిందన్నారు. ఇది భవిష్యత్‌లో రూ.40వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. దాదాపు 10వేల కోట్లు యాదాద్రిలో అంచనాలు పెంచారు.. అవి ఎవరి జేబుల్లోకి వెళ్లాయన ప్రశ్నించారు. ఎన్టీపీసీ ద్వారా పర్ మెగావాట్ ఉత్పత్తికి 7 కోట్ల 38 లక్షలు, యాదాద్రి పవర్ ప్రాజెక్టు ద్వారా మెగావాట్ ఉత్పత్తికి 8 కోట్ల 64 లక్షలు అవుతోందన్నారు.
వీళ్లు ఎన్టీపీసీకి ధోఖా చేస్తే.. ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ అనుమతించిందన్నారు. కావాలంటే రికార్డులు ముందు పెడతామన్నారు. 2015లో వాళ్లు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు.. 2023లో కేంద్రం తీసుకొచ్చిన నిబంధనను సాకుగా చెబుతున్నారని అన్నారు. సభను, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం వైఎస్, చంద్రబాబు దగ్గర ఊడిగం చేసింది మీరే.. మీరు మా గురించి మాట్లాడుతున్నారా? అని ఫైర్ అయ్యారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై, పాలమూరు వలసలపై ఆనాడు నేను అసెంబ్లీలో మాట్లాడా.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణపై నేను అసెంబ్లీలో ఎంత మాట్లాడానో.. కేసీఆర్ పార్లమెంట్ లో ఎంత మాట్లాడారో రికార్డులు తీయండన్నారు.
ఇతరుల త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చింది వీళ్లు.. జర్నలిస్ట్ పై కేసు పెట్టామని చెబుతున్న వీళ్లు.. వారి పాలనలో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి ఆమె ఛానల్ ను గుంజుకున్నారు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ పై మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఆడబిడ్డలను జైల్లో పెట్టినందుకే ఇప్పుడు ఆ పాపం అనుభవిస్తున్నారు. ఆనాడు నన్ను జైల్లో పెట్టినా నేను భయపడలేదు.. అబద్దాలు చెబితే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు.. విద్యుత్ పై మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఆగస్టు 1, 2న బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్దం.. మీరెంత అబద్ధాలు చెబితే నేను అంత నిజాలు చెబుతానన్నారు.