మీరు ప్రజల వైపా..? అదానీ వైపా..? : బీఆర్ఎస్‌ను ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి
75 ఏళ్లుగా కాంగ్రెస్ ఎంతో కష్టపడి దేశ ప్రతిష్ఠను పెంచిందని.. అదానీ, ప్రధాని ప్రపంచం ముందు మన దేశ పరువు తీశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 18 Dec 2024 11:00 AM GMT75 ఏళ్లుగా కాంగ్రెస్ ఎంతో కష్టపడి దేశ ప్రతిష్ఠను పెంచిందని.. అదానీ, ప్రధాని ప్రపంచం ముందు మన దేశ పరువు తీశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అమెరికాకు సంబంధించిన సంస్థలకు అదానీ లంచాలు ఇచ్చారని అమెరికా విచారణ సంస్థలు నివేదిక ఇచ్చాయి. దేశ పరువు ప్రతిష్టను మంటకలిపిన అదానీపై విచారణ చేపట్టాలని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. లోక్ సభలో రాహుల్ గాంధీ నిలదీసినా ప్రధాని నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు.. అందుకే ఇవాళ దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిందన్నారు.
టీపీసీసీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది.. ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నాం. ప్రభుత్వమే ధర్నాకు కూర్చోవడం కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి కడుపులో నొప్పి ఉండొచ్చు. అదానీపై కేసీఆర్, బీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలి.. వారి వైఖరి ఏమిటో చెప్పకుండా కాంగ్రెస్ ను అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు.. బీజేపీతో బీఆరెస్ చీకటి ఒప్పందంలో భాగంగానే ఆదానీపై వారు స్పందించడం లేదు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది.. అందుకే ఆదానీపై బీఆర్ఎస్ మాట్లాడటంలేదన్నారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ విధానం ఏమిటో చెప్పాలి.. మీరు ప్రజల వైపా..? అదానీ వైపా..? చెప్పాలన్నారు.
ఆదానీపై మాట్లాడితే వీళ్లను జైల్లో పెడతారనే మాట్లాడటం లేదు.. మమ్మల్ని విమర్శించడం కాదు.. ఆదానీపై, జేపీసీపై మీ వైఖరేంటో చెప్పండి.. మీ ఎంపీలతో లేఖ రాయించండి.. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదు.. నాణానికి బొమ్మ, బొరుసులాంటి వారు.. బీఆర్ఎస్ జేపీసీపై డిమాండ్ చేస్తే శాసన సభలో తీర్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశాన్ని దోచుకున్న ఆదానీపై జేపీసీ వేయడానికి ప్రధాని ఎందుకు సిద్ధంగా లేరు..? అదానితో లాలూచీ ఏంది..? జేపీసీ వేయకపోతే అవసరమైతే రాష్ట్రపతి భవన్ వద్ద కూడా ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.. తన స్నేహితుడిని కాపాడేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.. కానీ అదానీని కాపాడలేరు అన్నారు.