ఫోన్ టాపింగ్‌కు పాల్పడిన వాళ్లు చర్లపల్లి జైలులో ఊచలు లెక్కబెడతారు : సీఎం రేవంత్
వాల్మీకి బోయల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత సంక్షేమంలో, అభివృద్ధి, విద్యలో సముచిత స్థానం కల్పించే బాధ్యత
By Medi Samrat Published on 29 March 2024 12:38 PM GMTవాల్మీకి బోయల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత సంక్షేమంలో, అభివృద్ధి, విద్యలో సముచిత స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వాల్మీకి బోయలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాల్మీకి బోయలు కాంగ్రెస్ కు అండగా నిలబడాలని కోరారు. వందరోజుల్లో ఒక మంచి పరిపాలన అందించాం.. పరిపాలనలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.
వందరోజులు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేసిందన్నారు. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసాం.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వంపై ఉద్యోగులు విశ్వాసం కోల్పోయారన్నారు. ఉద్యోగులకు మొదటి తారీఖు జీతాలు ఇచ్చి ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాం.. గడీలను బద్దలు కొట్టి ప్రజా పాలన తీసుకొచ్చామన్నారు.
మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి భయపడేలా ఉండకూడదన్నారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిందన్నారు. కొద్ది మందివి విన్నామని సిగ్గులేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు.. ఇలా బరి తెగించి ఎవరైనా మాట్లాడుతారా.? అని ప్రశ్నించారు. కేటీఆర్ బరి తెగించి మాట్లాడుతున్నారు. దాని ఫలితం ఆయన అనుభవిస్తారన్నారు. ఫోన్ టాపింగ్ కు పాల్పడిన వాళ్లు చర్లపల్లి జైలులో ఊచలు లెక్కబెడతారని జోస్యం చెప్పారు. 200 ఓట్లతో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గెలవబోతున్నామన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ గూడు పుఠాని చేయకపోతే ఆలంపూర్, గద్వాల గెలిచే వాళ్లమన్నారు. అధికార బీజేపీలో ఉన్న డీకే అరుణ.. ఆర్డీఎస్ ద్వారా కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చారా.. తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తి చేశారా.? అని ప్రశ్నించారు. జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకున్న అరుణమ్మ పాలమూరు రంగా రెడ్డికి ఎందుకు జాతీయ హోదా తీసుకురాలేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు. ఏం ముఖం పెట్టుకుని మహబూబ్ నగర్ లో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.