ఆయనకు రాష్ట్రం అవసరంలేదు,రియల్ ఎస్టేట్ చాలు..రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
తెలంగాణలో నికృష్ణ, దుర్మార్గపు పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 2:48 PM IST
ఆయనకు రాష్ట్రం అవసరంలేదు,రియల్ ఎస్టేట్ చాలు..రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో నికృష్ణ, దుర్మార్గపు పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆమన్‌గల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. దరిద్రపు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు రాజులా బతికారని.. కేసీఆర్ రైతుబంధు వస్తే.. రేవంత్ ఇంకా వేస్తా అనే అంటున్నాడని విమర్శించారు. 70 లక్షల మంది రైతులను కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటే.. రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని తీవ్ర విమర్శలు చేశారు.
కొడంగల్‌కు వలస వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడా ఎవరికీ న్యాయం చేయలేదని కేటీఆర్ విమర్శించారు. సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు, అచ్చంపేటకు, కల్వకుర్తికి ఒక్క పని చేయలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అత్తగారి ఊరు కల్వకుర్తిలో ఉన్న ఆడబిడ్డలకు రూ.2500 ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వడం కాదు, మెడలో పుస్తెల తాడు కూడా పట్టుకుని పోతాడంటూ ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే ఉపాయం లేదా అని.. అన్ని వర్గాల ప్రజలు అడుగుతున్నారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రిని తిట్టని తిట్లు ప్రజలు తిడుతున్నారని కేటీఆర్ అన్నారు.
సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే.. పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులకు ఒక్కో ఎకరానికి రూ.17,500 బాకీ ఉన్నారు.. కాంగ్రెస్ వాళ్లను మళ్లీ నమ్మి మోసపోవద్దని, మళ్లీ మోసపోతే ఎవరూ కాపాడలేరని కేటీఆర్ అన్నారు. ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు గల్లా పట్టుకుని నిలదీయాలని కేటీఆర్ కోరారు.
ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ పేర్లతో కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. వెల్దండలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికే 500 ఎకరాల భూమి ఉందని, ఎన్నికలు అయ్యాక వెయ్యి ఎకరాలు కొనుగోలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. తన భూముల రేట్లు పెంచుకోవడానికే ఫోర్త్ సిటీ అంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి రాష్ట్రం అవసరం లేదని, రియల్ ఎస్టేట్ ఉంటే చాలని సెటైర్ వేశారు.
420 దొంగ హామీలు ఇచ్చి, నంగనాచి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ఒక పచ్చి మోసగాడు.- ఆమనగల్ రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/qKiHxSfBdU
— BRS Party (@BRSparty) February 18, 2025