సీఎం సోదరుడి ఇల్లు కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?: కేటీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
By Knakam Karthik
సీఎం సోదరుడి ఇల్లు కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?: కేటీఆర్
హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 20 నెలల తన పాలన చూపించి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలి. రేవంత్ తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుంది. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారు..అని కేటీఆర్ పేర్కొన్నారు.
వారి కోసమే హైడ్రా పని చేస్తుంది
కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా అరాచకాలతోనే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను కేవలం 20 నెలల కాలంలోనే చేసిన రేవంత్ రెడ్డికి, తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయింది. 2014లో గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారు. హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ వృద్ధి అతలాకుతలం అయింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా ? పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా, పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదు. కాంగ్రెస్ నేతల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పని చేస్తుంది..అని కేటీఆర్ విమర్శించారు.