బీసీ డిక్లరేషన్ అబద్ధం, రాహుల్‌గాంధీ ఎన్నికల గాంధీగా పేరు మార్చుకోవాలి: కేటీఆర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 5 Feb 2025 11:57 AM IST

Telangana, Congress, Brs, Cm Revanth, Ktr, Rahul Gandhi, Caste Census

బీసీ డిక్లరేషన్ అబద్ధం, రాహుల్‌గాంధీ ఎన్నికల గాంధీగా పేరు మార్చుకోవాలి: కేటీఆర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఆయన పేరును ఎన్నికల గాంధీ అని మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి కులగణన సర్వే నివేదికను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అబద్దాలు, హేయమైన అబద్దాలు, అబద్ధాలు తప్ప మరేమీ లేవని అసెంబ్లీలో కులగణన రిపోర్టు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. అలాగే నిన్నటి అసెంబ్లీ సమావేశం తెలంగాణ ప్రజలకు రెండు విషయాలను స్పష్టం చేసిందని.. ఒకటి స్పష్టత లేని విధ్వంసకర ప్రభుత్వం.. రెండవది బీసీ డిక్లరేషన్ పేరుతో మీరు సిగ్గులేకుండా చేస్తున్న అబద్ధాలు! అని మండిపడ్డారు. అంతే కాకుండా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం లేదని నిన్నటితో అది కూడా తేలిపోయిందని విమర్శించారు.

రిజర్వేషన్ల అంశంలో నిసిగ్గుగా కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకుందని.. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసిందని.. దీంతో మీరు ఎంత నిబద్ధతతో ఉన్నారో స్పష్టంగా తెలియజేస్తుందని ఆరోపించారు. ఇక రాహుల్ గాంధీ హామీలు, చెప్పిన వాగ్ధానాలు, చేసిన ప్రకటనలు, అన్నీ బూటకం తప్ప మరేమీ కాదని మరోసారి రుజువు అయిందని దుయ్యబట్టారు. అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ గాంధీ, మీరు మీ పేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధమని, సర్కారు నిబద్ధత వంద శాతం ప్రహసనం అని తేలిపోయిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Next Story