తీర్పులు మీ స్థాయి కాదు, పంచ్ డైలాగుల కోసం పరువు తీయకండి: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 26 March 2025 9:34 PM IST

Telangana, Cm Revanthreddy, Ktr, Brs, Congress, MLA defection case

తీర్పులు మీ స్థాయి కాదు, పంచ్ డైలాగుల కోసం పరువు తీయకండి: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన, ఇలా రాసుకొచ్చారు.. రేవంత్ రెడ్డి కనీసం ముఖ్యమంత్రిలా నటించాలి. మన సీఎం, తాను సీఎం అనే విషయాన్ని తరచుగా మర్చిపోతుంటారని, ఆయన తన పాత్రను మార్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారని అన్నారు. ఈ రోజు ఏకంగా తానే సుప్రీంకోర్టు అని తేల్చేశాడని, అసెంబ్లీలో ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసుపై తీర్పు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.

పార్లమెంటరీ నియమాల ప్రకారం కోర్టు దృష్టిలో ఉన్న అంశాలను సభలో ప్రస్తావించకూడదు కానీ.. రేవంత్ రెడ్డి తాను నిబంధనలకు అతీతుడను అని స్పష్టం చేశాడని, సుప్రీం కోర్టు కన్నా తానే ఎక్కవ అని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడని దుయ్యబట్టారు. సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ తప్పకుండా కోర్టుల దృష్టికి తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. అలాగే రేవంత్ రెడ్డికి ఇది మొదటి సారి కాదని, గత సంవత్సరం తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పిన తర్వాత రెండవ సారి అని చెప్పారు.

ఇక రేవంత్ రెడ్డి సీఎంలా ప్రవర్తించాలని, కనీసం సీఎంలా నటించాలని కోరారు. అంతేగాక ముఖ్యమంత్రిగా పనిచేస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నారు.. కానీ పరకాయప్రవేశాలు, పగటివేషాలు, పిట్టలదొర మాటలతో కాలం వెళ్ళబుచ్చాలని చూస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. మీ నాటకాలకి, సెన్సేషనల్ హెడ్ లైన్లకి, పంచ్ డైలాగులకు కోర్టుల పరువు తీయకండి అని, ఉపఎన్నిక రావాలా వద్దా అన్నది కోర్ట్ నిర్ణయం, దానికి అర్హులయిన జడ్జిలు ఉన్నారని తెలిపారు. మీరు పడకేసిన పాలన సంగతి చూడండి.. తీర్పులు మీ స్థాయి కాదు! అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story