సీఎం రేవంత్ తిట్ల ట్రాప్‌లో పడొద్దు..కేటీఆర్ సంచలన ట్వీట్
వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే రేవంత్ తిట్ల పురాణం మొదలుపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
By - Knakam Karthik |
సీఎం రేవంత్ తిట్ల ట్రాప్‌లో పడొద్దు..కేటీఆర్ సంచలన ట్వీట్
హైదరాబాద్: వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే రేవంత్ తిట్ల పురాణం మొదలుపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు రేవంత్ ట్రాప్‌లో బీఆర్ఎస్ శ్రేణులు పడొద్దని తన ఎక్స్ ఖాతా ద్వారా పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రజల అసలు సమస్యల నుంచి చర్చను పక్కదోవ పట్టించేందుకే రేవంత్ రెడ్డి దూషణల పర్వాన్ని ఎంచుకున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఆయన పన్నుతున్న ‘తిట్ల ట్రాప్’లో పార్టీ శ్రేణులు చిక్కుకోవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, సంక్షేమ పథకాల అమలు వంటి మౌలిక వసతులపై చర్చ జరగాల్సి ఉండగా, సీఎం రేవంత్ తన ‘బూతు పురాణం’తో చర్చను నీరుగారుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్‌పై చేస్తున్న దాడిని తెలంగాణ పోరాట చరిత్రపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. "పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన శిల్పి కేసీఆర్. ఆయన ఏనాడూ బిరుదుల కోసం పాకులాడలేదు. ప్రజల సంక్షేమమే ఆయనకు అసలైన సత్కారం" అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని, ఈ నమ్మకద్రోహంపైనే మన పోరాటం ఉండాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. "ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడిన రైతుల కష్టాలు, రైతు భరోసా అందక వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతున్న అన్నదాతల ఆవేదనపై ప్రభుత్వాన్ని నిలదీయండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు, గురుకులాల్లో విషాహారంతో చిన్నారులు పడుతున్న బాధలకు బాధ్యులెవరని గల్లా పట్టి అడగండి" అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ సోదర సోదరీమణులారా, కోట్లాది మంది ఆశల రూపమైన గులాబీ సైనికులారా, నిజాన్ని నిర్భయంగా చాటే మీడియా మిత్రులారా..ఇవాళ తెలంగాణ గడ్డపై ఒక వికృతమైన రాజకీయ క్రీడ జరుగుతోంది. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి మన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు…
— KTR (@KTRBRS) February 6, 2026