అప్పుడే చెప్పాం..తులం బంగారం కాదు, రోల్డ్ గోల్డ్ కూడా ఇవ్వరు: కేటీఆర్
రాష్ట్రంలో ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇవ్వడం చేతకానివాళ్ళు మహిళలను కోటీశ్వరులను ఎట్లా చేస్తారు..అని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు.
By Knakam Karthik
అప్పుడే చెప్పాం..తులం బంగారం కాదు, రోల్డ్ గోల్డ్ కూడా ఇవ్వరు: కేటీఆర్
రాష్ట్రంలో ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇవ్వడం చేతకానివాళ్ళు మహిళలను కోటీశ్వరులను ఎట్లా చేస్తారు..అని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం, యూసుఫ్‌గుడ డివిజన్ ముఖ్య నాయకులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నిర్మాణం పటిష్టంగా ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 50వేల మంది సభ్యత్వంతో బీఆర్ఎస్ బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసీటు ఇవ్వకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు. అడ్డిమారి గుడ్డి దెబ్బలో బీజేపీ ఒక్కసీటు గెలిచింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 16వేల ఓట్ల మెజారిటీతో మాగంటి గోపీనాధ్ గెలిచారు. యూసఫ్ గూడ డివిజన్ లో 51 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. బస్తీల్లో ఉండే పేదలకు మాగంటి గోపీనాధ్ మంచి చేశారు తప్ప చెడు చేయలేదు.మాగంటి గోపీనాధ్ మరణం ఊహించలేదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి అనుకోకుండా ఉపఎన్నిక వచ్చింది..అని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో కేసీఆర్ లక్షమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. హైడ్రా పేరుతో నిర్దాక్షిణ్యంగా పేదల ఇళ్ళు కూలుస్తున్నారు. హైడ్రా పెద్దల జోలికి పోదు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఇల్లు రెడ్డికుంటలో ఉంటుంది. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గంచెరువు ఎఫ్.టి.ఎల్ లో ఉంటుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కె.వి.పి రామచంద్రరావు ఇళ్లు చెరువు బఫర్ జోన్ లో ఉన్నాయి. హైడ్రా కాంగ్రెస్ వాళ్లకు చుట్టం పేదలకు భూతం. కేసీఆర్ ఎప్పుడూ కులంపేరుతో రాజకీయం చేయలేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో ఆంధ్రా, తెలంగాణ పంచాయతీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే తులం బంగారం కాదు రోల్డ్ గోల్డ్ కూడా ఇవ్వరు అని ఆనాడే చెప్పాము. కరోనా సమయంలో రూపాయి రాకపోయినా ఏ పధకం ఆగలేదు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదు. లంకె బిందెలు కోసం దొంగలు వెళ్తారు. లంకె బిందెల కోసం వచ్చానని సీఎం అంటున్నారు. రాష్ట్రం దివాళా తీసిందని స్వయంగా సీఎం చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ అందానికి, 20నెలల పాలనకు ఓట్లు వేయాలి అంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 50వేల మెజారిటీతో బీఆర్ఎస్‌ను గెలిపించి ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలి. కాంగ్రెస్,బీజేపీ అవగాహనతో పనిచేస్తున్నాయి. మోదీ, రేవంత్ రెడ్డి అజెండా ఒక్కటే. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతిని బీజేపీ కాపాడుతోంది. మాగంటి గోపీనాధ్ ఎన్టీఆర్ ఉన్నంతకాలం ఎన్టీఆర్ కు విధేయుడుగా ఉన్నారు. ఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్నారు. కేసీఆర్ తిరిగి సీఎం కావాలని మాగంటి గోపీనాధ్ తపనపడ్డారు. డివిజన్ లో ప్రతి 25 ఇళ్లకు ఒకరు భాద్యత తీసుకోవాలి. కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పాలన బాగుందా వారితో మాట్లాడాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ వాళ్ళ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలి..అని కేటీఆర్ సూచించారు.