ప్రజాపాలన కాదు..కమీషన్ల పాలన నడుస్తోంది: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
By Knakam Karthik
ప్రజాపాలన కాదు..కమీషన్ల పాలన నడుస్తోంది: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ.. గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. కమిషన్‌లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించడంలేదు. పాలన కనిపించడంలేదు. డైరెక్ట్‌గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్‌లు లేనిదే పనులు జరగడం లేదు..అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో కమిషన్‌ల పాలన నడుస్తోంది. ప్రజల పాలన కాదు..అని కేటీఆర్ ఆరోపించారు.
నేను సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నా.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయింది. మీ కమిషన్‌ల ఆరాటంలో మృతదేహాలను వెలికితీయడానికి సైతం సాహసం చేయలేకపోయారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. నల్గొండలో సుంకిశాల ప్రాజెక్టు కూలింది. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు..అని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి.ప్రజల సమస్యలపై కాకుండా పచ్చి నాటకంపై దృష్టి పెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొడుతున్నారు.ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి.నిజాయతీ ఎప్పటికీ ఓడిపోదు. మీరు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది. తులం బంగారం ఏమైంది? రూ.4 వేల పెన్షన్ ఏమయ్యాయి? మీరు ఎంత నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి. మీవి అన్ని చిల్లర ప్రయత్నాలు మాత్రమే.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించనున్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి..అని కేటీఆర్ అన్నారు.