త్వరలోనే ఉపఎన్నికలు, మళ్లీ అధికారంలోకి వస్తాం..కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 5:17 PM IST
త్వరలోనే ఉపఎన్నికలు, మళ్లీ అధికారంలోకి వస్తాం..కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో ప్రజా పోరాటం రాబోతుందని చెప్పారు. ప్రజల కోసం పోరాటం చేయగల పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అని, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మరో పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2028లో అధికారంలోకి వచ్చేది వంద శాతం తామే అని, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వెనక్కి పయనిస్తోందని అన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు.
పార్టీ స్థాపించి 25 ఏళ్లు కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏడాది పొడవునా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలో వ్యవస్థాగత కమిటీలు వేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అదే విధంగా.. పార్టీలో మహిళా కమిటీలు ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఆయా కమిటీలకు ఇన్‌చార్జ్‌గా హరీష్ రావును నియమిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి జిల్లాలో చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 10న బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించి.. పార్టీ ప్లీనరీ సమావేశాలపై చర్చిస్తామని కేసీఆర్ తెలియ జేశారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఇంత తొందరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనుకోలేదు..అని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఆదాయం పెంచుకుంటూ పోయామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుందని విమర్శించారు. అదే అధికారులు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వానికి చేయించుకోవడం రావడంలేదని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయి, మీరు సిద్దంగా ఉండండి. మళ్లీ మనదే అధికారం, మీరే ఎమ్మెల్యేలు అవుతారు అని కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.