పదేళ్లు కాపాడుకుంటూ వచ్చాం.. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది: కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు.
By Medi Samrat Published on 6 Feb 2024 4:07 PM ISTబీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ కు ఆయన దాదాపు మూడు నెలల తర్వాత వచ్చారు. కార్యకర్తలు ఆయనకు హారతి ఇచ్చి ఆహ్వానం పలికారు. కేసీఆర్ సమీక్షా సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు కూడా తెలంగాణ భవన్ కు వచ్చారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళితే మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. డ్యామ్‌కు సున్నం వేయాలన్నా కేఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అన్నారు. బీఆర్ఎస్‌కు పోరాటం కొత్తకాదని, తెలంగాణ ప్రయోజనాలే మనకు ముఖ్యమని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఎండగడుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై, ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను, హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకు ఉన్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం ఒత్తిళ్లను తట్టుకుంటూ పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి వచ్చిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.