తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
2014-2023 మధ్యకాలంలో విపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకుందని, కొందరు మంత్రులు కూడా అయ్యారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారెవరిపైనా అనర్హత వేటు పడలేదని, అప్పటి నుంచి ఇప్పటివరకు చట్టం, న్యాయం, రాజ్యాంగం మారలేదన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని అన్నారు. రావని చెప్పడానికి ఇది రేవంత్ రెడ్డి జాగీరు కాదని విమర్శించారు. సుప్రీంకోర్టు మీద తమకు పూర్తి నమ్మకం ఉందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు చాలా చక్కగా ఉండేవని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.