ఆయన రాష్ట్రానికి పట్టిన పీడ..సీఎంపై హరీష్ రావు హాట్ కామెంట్స్

సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు విమర్శించారు.

By Knakam Karthik  Published on  16 March 2025 4:03 PM IST
Telangana, Cm Revanthreddy, Brs, Harishrao, Congress

ఆయన రాష్ట్రానికి పట్టిన పీడ..సీఎంపై హరీష్ రావు హాట్ కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ డేటాను నమ్ముకుంటే, సీఎం రేవంత్ మాత్రం డర్టీ ట్రిక్స్ నమ్ముకున్నారని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకున్నా జగదీశ్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దారుణమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం బూతులకు జీఎస్టీ వేస్తే రాష్ట్ర ఖజానా మొత్తం సరిపోదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చావును కోరుకున్న రేవంత్, ఆ తర్వాత మాట మార్చి బీఆర్ఎస్ ను అన్నానని చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డిని కేసీఆర్ ఎప్పుడూ గౌరవంగా సంబోధించేవారని గుర్తు చేశారు.

రుణమాఫీపై రేవంత్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. సంపూర్ణ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. రాష్ట్ర భవిష్యత్తు పట్ల కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని జీఎస్డీపీలో నంబర్ వన్ గా, తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిపామని గుర్తు చేశారు. విద్యుత్ వినియోగంలో, వరి ధాన్యం ఉత్పత్తిలోనూ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపామని చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు.

రాష్ట్రం పట్ల ప్రస్తుత సర్కారుకు బాధ్యత లేని కారణంగానే ప్రాజెక్టులు అగ్గిపెట్టెల్లా కూలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని హరీశ్ రావు దుయ్యబట్టారు. రేవంత్ నిర్లక్ష్యం వల్ల రైతులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పదవి కోసం కేటీఆర్ తో తాను పోటీ పడలేదని, తామిద్దరం ఉద్యమకారులమని, కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశామని హరీశ్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలమని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని లాంటి రేవంత్ రెడ్డి పీడను వదిలించడానికి తాము పోటీ పడతామని హరీశ్ రావు తేల్చి చెప్పారు.

Next Story