రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం..ఇప్పటివరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్గ కాలం తర్వాత తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు
By - Knakam Karthik |
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం..ఇప్పటివరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్గ కాలం తర్వాత తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. కానీ ఎంత తెలివితక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మొదటి నుండి శని.. తెలంగాణలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరడం.. ఆయన మాటలు పట్టుకొని తెలంగాణలో అబివృద్ధి పథకాలను బీజేపీ వ్యతిరేకించడమే పని అయ్యింది..అని విమర్శించారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. కానీ ఎంత తెలివితక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారుకానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదుకేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మొదటి నుండి శని..… pic.twitter.com/MPrC2glJyO
— Telugu Scribe (@TeluguScribe) December 21, 2025
రెండేళ్లు ఆగామని, ఇక ఆగేది లేదని, ఇకపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది... ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. భూములు అమ్మడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఉపేక్షించేది లేదని, రాష్ట్రాన్ని రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు ముందుకు వెళ్లడంలేదు, ఎవరి కుట్ర ఉంది... ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ విధానాలను ఎండగడతామని కేసీఆర్ హెచ్చరించారు. గోదావరి నీళ్ల దోపిడీపై ప్రభుత్వం స్పందించడంలేదని మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా ఏపీ 80 టీఎంసీల గోదావరి నీటిని వాడుకుంటోందని అన్నారు. బచావత్ ట్రైబ్యునల్ ద్వారా ఎగువ రాష్ట్రాలకు ఆ 80 టీఎంసీలు ఇస్తామని ఏపీ చెప్పిందని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర చెరో 20 టీఎంసీలు వాడుకుంటున్నాయని... బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను పట్టించుకున్న వారే లేరని విచారం వ్యక్తం చేశారు. 40 టీఎంసీలు చాలని కేంద్రానికి ఎలా లేఖ రాస్తారని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు.
ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా నేనా?ఈ కాంగ్రెస్ సర్కార్ కు ప్రజా సమస్యలు పట్టవా?ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుండి ఇంకో లెక్కరెండేండ్లు ఓపిక పట్టినం..ఇగ ఊరుకునేది లేదు..తోలు తీస్తం..!బీఆర్ఎస్ అధినేత కేసీఆర్🔥 pic.twitter.com/RjtUQ45JYJ
— BRS Party (@BRSparty) December 21, 2025
నాడు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పాలమూరుకు ద్రోహం చేశాయని ఆరోపించారు. ఎంత దద్దమ్మ ప్రభుత్వం అయినా పాత ప్రాజెక్టులు కొనసాగించాలని స్పష్టం చేశారు. ఇక మౌనంగా ఉండేదిలేదని, బహిరంగ సభలు నిర్వహించి నీళ్ల కోసం నిలదీస్తామని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన మోసం నుంచి ఇప్పటికైనా బయటపడాలంటే, కొట్లాడి మన నీటి వాటా సాధించుకోవాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడని వెల్లడించారు.
కానీ అభివృద్ధి పేరిట ఇష్టానుసారం పునాదిరాళ్లు వేశారే కానీ, అభివృద్ధి మాట మరిచారని విమర్శించారు. ఆ పునాది రాళ్లన్నీ కలిపితే ఒక ప్రాజెక్టు పూర్తవుతుందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఒక్క చుక్క నీరు కూడా పొలాల్లోకి పారలేదని, దాంతో పాలమూరు నుంచి ముంబైకి వలసలు పెరిగాయని వివరించారు. ఆనాడు తాను నిలదీయబట్టే చంద్రబాబు జూరాల ప్రాజెక్టు నిర్మించాడని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ టీడీపీ ఎమ్మెల్యే బాంబులతో ఆర్డీఎస్ కాలువను పేల్చేశాడని తెలిపారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు పెద్ద శాపంలా మారిందని, మహబూబ్ నగర్ జిల్లాకు తీవ్ర నష్టం జరిగిందని కేసీఆర్ వెల్లడించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణకు శనిలా దాపురించిందని అన్నారు.