తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను నియమించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడిని ఎన్నికల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఈ సమన్వయకర్తల ప్రధాన బాధ్యతగా ఉంటుంది.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి ముగిసే వరకు వీరు నిరంతరం ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంటారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ సమన్వయకర్తలు కీలక పాత్ర పోషిస్తారు. స్థానిక నాయకత్వంతో చర్చించి, గెలుపు గుర్రాలను గుర్తించి, నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి సమర్పిస్తారు.
అంతేకాకుండా, పార్టీ రూపొందించిన ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, బూత్ లెవల్ ఏజెంట్లను సమన్వయం చేయడం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. ఎన్నికల సరళిని మరియు గ్రౌండ్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తెలంగాణ భవన్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి నివేదించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పార్టీ తరపున నియమించబడిన మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తల పూర్తి జాబితాను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు అధికారికంగా విడుదల చేశారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు.