ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు బీఆర్ఎస్ దూరం..ఎందుకంటే?
ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది
By Knakam Karthik
ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు బీఆర్ఎస్ దూరం..ఎందుకంటే?
ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నోటా లేకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్డీఏ, ఇండి కూటమి రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్దంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నోటాకు ఓటు వేయాలని బీఆర్ఎస్ భావించినప్పటికీ, ఆ ఆప్షన్ లేకపోవడంతో.. తటస్థంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా బీఆర్ఎస్‌కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పవనే ఆలోచనతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ కూడా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదనే భావనకు వచ్చినట్లు సమాచారం. కాగా 2022లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ ఓటు వేయగా.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్‌లో ఉండగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య ప్రతి అంశంలో విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం సరికాదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.