ఇప్పటికే హైడ్రా తోక ముడిచింది.. త్వరలోనే మూసీ ప్రక్షాళన కూడా తోక ముడుస్తుంది : ఈటెల

ఇండ్ల కూల్చివేతకు మూసీ పునరుజ్జీవంకు సంబంధం ఉందా రేవంత్ రెడ్డి..? అని బీజేపీ నేత‌, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్ర‌శ్నించారు

By Medi Samrat  Published on  25 Oct 2024 7:33 PM IST
ఇప్పటికే హైడ్రా తోక ముడిచింది.. త్వరలోనే మూసీ ప్రక్షాళన కూడా తోక ముడుస్తుంది : ఈటెల

ఇండ్ల కూల్చివేతకు మూసీ పునరుజ్జీవంకు సంబంధం ఉందా రేవంత్ రెడ్డి..? అని బీజేపీ నేత‌, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్ర‌శ్నించారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవంకు వ్య‌తిరేకంగా ఇందిరాపార్క్ బీజేపీ చేప‌ట్టిన మ‌హా ధ‌ర్నాలో ఆయ‌న మాట్లాడుతూ.. నల్లగొండ ప్రజలు బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరగాలి.. బీజేపీ కూడా అదే డిమాండ్ చేస్తోంది.. కానీ పేదల బ్రతుకులను వినాశనం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చ‌రించారు.

వంద ఏళ్ళ నుంచి మూసీ కింద ఇండ్లు మునిగినట్టు.. జనావాసాలు ఇబ్బందులు పడినట్టు నీరూపిస్తావా రేవంత్ రెడ్డి.. అబద్ధాలకు మారు పేరు రేవంత్ రెడ్డి.. మూసీకి రూ.140 కోట్లా..? లక్షన్నర కోట్లా..? అనేది రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ లేకుండా మూసీకి రూ.140 కోట్లు మంజూరు చేశామని చెబుతున్నారు.. ఎవడబ్బ జాగిరని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి..? అని నిల‌దీశారు. పేదల ఇండ్లను కూల్చే హక్కు నీకెవరిచ్చారు.. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్ల ఎక్కడి నుంచి తెస్తున్నారో చెప్పాలన్నారు. దమ్ముంటే ఎప్పటిలోగా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

10 కోట్లు అప్పు తెచ్చే దమ్ము రేవంత్ సర్కారుకు లేదు.. అట్లాంటిది లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తీస్తారో దమ్ముంటే రేవంత్ చెప్పాలన్నారు. పేదల ఇండ్లను కూల్చి, ఎవడబ్బ సొమ్ము అని లక్షన్నర కోట్ల ఖర్చుతో మూసీ ప్రక్షాళన చేస్తున్నారని ప్ర‌శ్నించారు. ఇప్పటికే హైడ్రా తోక ముడిచింది.. త్వరలోనే మూసీ ప్రక్షాళన తోక ముడుస్తుంది అని అన్నారు. ప్రజలెవరూ బయపడొద్దు.. అండగా మేముంటాం అని భ‌రోసా ఇచ్చారు.

Next Story