దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోము : బీజేపీ నేతలు

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బీజేపీ ఆఫీసును ముట్టడించారు.

By Medi Samrat  Published on  7 Jan 2025 6:00 PM IST
దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోము : బీజేపీ నేతలు

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బీజేపీ ఆఫీసును ముట్టడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయానికి చేరుకొని రాళ్ల దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోడానికి పోలీసులు ప్రయత్నించారు.

ఈ దాడిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తమ కార్యాలయంపై దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని, బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా లేకుండా చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందేనని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు.

కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోను విడుదల చేశారు. ఇటువంటి హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదని, కాంగ్రెస్ నాయకత్వం నిరాశను ఎత్తి చూపుతున్నాయన్నారు. ఈ సిగ్గుమాలిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story