తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడంపై తెలంగాణ బిజెపి, కాంగ్రెస్‌లోని విపక్షాలు బుధవారం తీవ్రంగా ప్రతిస్పందించాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సహా, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన నేతల సమక్షంలో.. టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ప్రకటించారు. అయితే ఇది రాజకీయ దురాశతో ఈ ఆలోచన పుట్టిందని విపక్ష నేతలు ఆరోపించారు. అయితే టీఆర్‌ఎస్ మిత్రపక్షం ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దీనిని స్వాగతించారు. పేరు మార్చినంత మాత్రాన ఏ పార్టీ జాతీయ పార్టీగా మారదని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్‌లో తనదైన స్టైల్లో సెటైర్ వేశారు. 'టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం పందికి లిప్ స్టిక్ పెట్టినట్లు ఉంది. ట్విట్టర్ టిల్లు కేటీఆరేమో కేసీఆర్ ను గేమ్ చేంజర్ అంటున్నారు. కానీ, తన తండి నేమ్ చెంజర్ అయ్యారు. అంతిమంగా ప్రజలే కేసీఆర్‌ను మార్చుతారు' అంటూ ట్విట్టర్‌లో కామెంట్స్ చేశారు.
కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్ నుంచి పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడాన్ని మినహాయిస్తూ కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చంపేశారని, కుటుంబ కలహాలు తీర్చుకునేందుకు, రాజకీయ దురాశను నెరవేర్చుకునేందుకు ఇలా చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల్లో పోరాడే అర్హత టీఆర్‌ఎస్ అధినేతకు లేదని ఆయన అన్నారు. తెలంగాణ పదం కూడా వినిపించకుండా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.