ఆ సెంటిమెంట్‌తో అధికారంలోకి రావాలనేది హరీశ్‌రావు భ్రమ: కాంగ్రెస్ ఎంపీ
హరీష్ రావు తెలంగాణ ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
By - Knakam Karthik |
ఆ సెంటిమెంట్‌తో అధికారంలోకి రావాలనేది హరీశ్‌రావు భ్రమ: కాంగ్రెస్ ఎంపీ
హరీష్ రావు తెలంగాణ ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నీళ్లపై తనకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదన్నట్లు హరీష్ రావు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. టీఎంసీలు, క్యూసెక్కులపై తనకే అన్నీ తెలుసన్న భ్రమలో ఆయన ఉన్నారని వ్యాఖ్యానించారు. నీళ్ల అంశాన్ని తెలంగాణ సెంటిమెంట్‌గా మలిచి మళ్లీ అధికారంలోకి రావాలన్న భ్రమల్లో హరీష్ రావు జీవిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అసత్య ప్రచారం చేయడమే హరీష్ రావు అజెండా అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దక్షిణ తెలంగాణలో కృష్ణా నదిపై గత కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ హయాంలో ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కృష్ణా నది 69 శాతం తెలంగాణ భూభాగంలో ప్రవహిస్తుంటే, 812 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలే సరిపోతాయని కేసీఆర్, హరీష్ రావు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. అప్పుడు కృష్ణా జలాల వాటా కోసం సీడబ్ల్యూసీ ముందు హరీష్ రావు ఎందుకు ధర్నా చేయలేదని నిలదీశారు. “పదేళ్లలో గాడిద పళ్ళు తోమారా?” అంటూ ఘాటైన ప్రశ్న వేశారు.
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లు ఉంటే కమిషన్లు రావని కొత్త టెండర్లు పిలిచారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టిని కాదని గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది కేవలం కమిషన్ల కోసమే కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు గోదావరి, బనకచర్ల, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ నీటి హక్కుల ప్రకారం కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు 500 టీఎంసీలకు పైగా రావాలని స్పష్టం చేశారు.
బనకచర్ల అంశంపై జనవరి 5న సుప్రీంకోర్టులో విచారణ ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు–రేవంత్ రెడ్డి ఒక్కటే అన్న సెంటిమెంట్‌తో రాజకీయ లబ్ధి పొందాలని బిఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అన్నారు. బిఆర్ఎస్ డ్రామాలను తెలంగాణ, ఏపీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను బిఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించారు.
“రాయలసీమను రత్నాల సీమ చేస్తాను”, “బేసిన్లు, భేషజాలు లేవు”, “3 వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి” అన్న మాటలు అన్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆద్యం పోసింది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తమకు కృష్ణా, గోదావరి నదీ జలాలపై పూర్తి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. కృష్ణా నదిలో పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎంత ఉందో అంత వాటా తెలంగాణకు రావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారని చెప్పారు. కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి వద్ద జరిగిన సీఎంల సమావేశంలో హరీష్ రావు లేరని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.