వీలైనంత త్వ‌ర‌గా అమలులోకి భూభార‌తి: మంత్రి పొంగులేటి

వీలైనంత త్వరగా తెలంగాణలో భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

By Knakam Karthik  Published on  20 Feb 2025 6:48 AM IST
Telangana, Minister Ponguleti SrinivasReddy, Bhubharati , Farmers, Congress, Brs, kcr

వీలైనంత త్వ‌ర‌గా అమలులోకి భూభార‌తి: మంత్రి పొంగులేటి

వీలైనంత త్వరగా తెలంగాణలో భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. క్షుణ్ణంగా, సమ్రగంగా పరిశీలించి చిన్న చిన్న పొరపాట్లకు తావు లేకుండా డ్రాఫ్ట్ విధివిధానాలను తయారు చేయాలని అధికారులకు సూచించారు. భూ భారతి చట్టానికి సంబంధించి విధి విధానాలు రూపొందించడంపై కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. భూమి మనిషి జీవనాధారం, అది కేవలం ఆస్తి మాత్రమే కాదు.. రైతుల ఉపాధి, జీవితానికే పునాది అని, మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. తెలంగాణలో భూమికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నా.. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా వాటికి సరైన పరిష్కారం దొరకలేదు, గతంలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల సమస్యలు మరింత తీవ్రం అయ్యాయని.. మంత్రి పొంగులేటి ఆరోపించారు.

గత ప్రభుత్వం తొందర పాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టించిందని, సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందని, ఈ పరిస్థితికి పరిష్కారంగా, తెలంగాణ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ చట్టం ద్వారా రైతుల భూములకు భద్రత కల్పించడంతో పాటు, భూ రికార్డులను కచ్చితంగా పరిరక్షించడానికి రూపొందించబడిందని తెలిపారు. సామాన్యులకు రెవెన్యూ సేవలు అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ ఆస్తులు, భూములను పరిరక్షించడం ప్రధాన బాధ్యత తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. భూమిని నమ్ముకుని బతికే కష్టజీవులను కాంగ్రెస్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని.. రైతు భూమికి సంబంధించి ఏ కష్ట వచ్చినా రెవెన్యూ కార్యాలయాల్లో పరిష్కారం లభించేలా విధివిధానాలు తయారు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story