మరో తెలంగాణ ఉద్యమం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని, తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పాలన ఐఫోన్‌లా ఉంటే.. రేవంత్ పాలన చైనా ఫోన్‌లా ఉందని ఎద్దేవా చేశారు. చైనా ఫోన్ చూడటానికే బాగుంటుందని.. కానీ సరిగ్గా పని చేయదని విమర్శించారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని బురిడీ కొట్టిన సీఎం రేవంత్, ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్డడం లేదని విమర్శించారు. తూతూమంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారని, స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశం కాలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చలు జరపకపోవడం బీసీలను అవమానించడమే అని విమర్శించారు. బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయమని.. ఈ తప్పుడు లెక్కలను రాహుల్‌గాంధీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని కవిత మాట్లాడారు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రజలను మోసం చేసిందని అన్నారు. రేవంత్ తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.