ఇప్పటికిప్పుడే ఎన్నికలకు తొందరెందుకు? : కవిత
తెలంగాణ ఉద్యమం తరహాలో మరో బీసీ ఉద్యమాన్ని చేపడుతాం..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు
By - Knakam Karthik |
ఇప్పటికిప్పుడే ఎన్నికలకు తొందరెందుకు?..కవిత కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం తరహాలో మరో బీసీ ఉద్యమాన్ని చేపడుతాం..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీల బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారంలో కవిత పాల్గొని మాట్లాడుతూ.. బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉంది. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ లు బంద్ కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయి. హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారు. బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతాం. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలి. యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. బీసీ బంద్ ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. ..అని కవిత పేర్కొన్నారు.
బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్ గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించటం లేదు. ఈ కారణంగానే బీసీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం జనగణన నిర్వహించలేదు. జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. అందుకే కోర్టు జీవో ను కొట్టేసింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముంది? మహారాష్ట్ర, తమిళనాడు లో 5 ఏళ్ల వరకు ఎన్నికలు జరగలేదు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోంది. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధి పనిచేయాలని నేను డిమాండ్ చేస్తున్నా..అని కవిత అన్నారు.